మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 21, సిఐటియు, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు జిలకరి పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడి సిబ్బందిని అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ, ఇతర డ్యూటీలను కూడా చేయిస్తూ, మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ, పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత ఏవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదని తెలిపారు. పోరుగు రాష్ట్రాలలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలను కల్పించారని అన్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో వామపక్ష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్లు, ప్రగతి భవన్ ముట్టలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సీత మహాలక్ష్మి, లలిత, విజయలక్ష్మి, భారతి, పుల్లమ్మ, లక్ష్మి, సీతా లక్ష్మి, సుజాత, ఆదిలక్ష్మి, స్రవంతి, మహాలక్ష్మి, ఏసు మని, చంద్రకళ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.