భూకబ్జాదారులకు కల్పవృక్షం జీవో నెంబర్-76
* ఖాళీ స్థలాలలో యదేచ్ఛగా కబ్జాల పర్వం
* తప్పుడు ధ్రువపత్రాలతో పట్టాలకు దరఖాస్తు
* వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
* బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భూకబ్జాదారులకు జీవో నెంబర్-76 కల్పవృక్షంగా మారిందని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.
పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి జీవో నెంబర్-76 కొందరి అధికార పార్టీ వారికి కాసులు కురిపించే కల్పవృక్షంలో మారిందని పేర్కొన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 76 జీవ ప్రకారం జరుగుతున్న దోపిడిని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. కొత్తగూడెం నడిబొడ్డున ఉన్న రైతు బజార్ స్థలంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు ఎండీ యూసుఫ్, షాహేరా పేర్ల మీద 5-9-39/1లో 480 గజాలు, మోరే భాస్కర్, పార్వతి పేర్ల మీద 5-9-39/2లో 480 గజాలకు ఇంటి నెంబర్లు తీసుకొని రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఇంటి పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలానికి ఇంటి పట్టా పొందేందుకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లులు లేని ప్రాంతంలో అక్కడ ఇల్లులు ఉన్నట్టు ఆ స్థలాలను వేరే వారి నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని అన్నారు. అదేవిధంగా గాజులరాజం బస్తీలో ఇంటి నెంబర్: 4-6-142 లో రావి రాంబాబు 311 గజాల స్థలం ఇంకో ప్రజాప్రతినిధి భర్త వద్ద కొన్నట్టు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో ఇల్లులు లేని ఖాళీ స్థలాలలో ఇంటి పట్టాలు పొందుటకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తులపై వారికి సహరకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అధికారులు తూతుమంత్రంగా పట్టాలు రద్దు చేసి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ అధికారం అడ్డుపెట్టుకొని ఈ వ్యవహారం నిడిపినందుకు వారిని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, సాయి, జిల్లా సహాయ కార్యదర్శి చేనిగారపు నిరంజన్ కుమార్, జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.