పెట్రేగిపోతున్న ల్యాండ్ మాఫియా!
* ఏజెన్సీ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరు
* వ్యవసాయ భూముల్లో ప్లాట్ల దందా
* మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానాలు ఆక్రమణల పర్వం
* అధికారుల పర్యవేక్షణ లేదంటూ జనం అసహనం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈ జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా పెట్రేగిపోతుంది.. దీనిని అదుపు చేసే నాధుడే కరువయ్యాడు.. ఏజెన్సీ ఏరియాలో రియల్ ఎస్టేట్ జోరు అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది.. ఆఖరికి మున్సిపాలిటీ పరిధిలోని క్రీడా మైదానాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూమిని సైతం కబ్జాదారులు ఆక్రమిస్తున్నారంటే.. భూదందా ఏ రేంజ్ లో జరుగుతుందో స్పష్టంగా అర్థం అవుతుంది.
కొత్తగూడెం పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ జోరు ఒక రేంజ్ లో గత కొన్ని నెలలుగా కొనసాగుతూ ముందుకు పోతుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం యదేచ్చగా కొనసాగుతుండడం విచారకరం. మున్సిపాలిటీ పరిధిలోని అక్కడక్కడ ఉన్న సర్కార్ భూములను కూడా భూకబ్జాదారులు వదలడం లేదు. ఆఖరికి క్రీడా మైదానాల కోసం కేటాయించిన భూమిని సైతం ఆక్రమణదారులు కబ్జా చేస్తూ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న దారుణ పరిస్థితి నెలకొనడం కలవరపెడుతుంది. క్రీడమైదానాల భూమిని లూటీ చేయడంతో దీనిపై కొన్ని ప్రజా సంఘాల వారు స్పందించి ఆ భూముల దగ్గరకు వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువస్తుండడంతో జిల్లా కేంద్రంలోని చర్చనీయాంశంగా మారింది. ఇటు రైతు బజార్ భూమి అటు క్రీడ మైదాన భూమిని దర్జాగా కబ్జాదాల ఆక్రమిస్తుంటే సంబంధిత శాఖల వారు ఏం చేస్తున్నారని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సర్కార్ భూములను కాపాడాల్సిన అధికారులే పట్టనట్లుగా ఉండడం బాధాకరమని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
1/70 ఏరియాలో రియల్ ఎస్టేట్ జోరు…
భద్రాద్రి జిల్లా కేంద్రం పరిధిలోని ఇటు చుంచుపల్లి అటు లక్ష్మీదేవిపల్లి మండలాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుండడంతో
చర్చకు దారి తీస్తుంది. ఈ చట్టం అమల్లో ఉండగా ఎలాంటి కమర్షియల్ లావాదేవీలు జరగకూడదని నిబంధన ఉన్న దీనికి కొందరు తూట్లు పొడిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించడం సహించరానిదని కొందరు ప్రజా సంఘాల నేతలు కన్నెర్ర చేస్తున్న పరిస్థితి నెలకొంది. చుంచుపల్లి పరిధిలోని రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీలో ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. కొందరు కబ్జాదారులైతే ఏకంగా చెరువునే మింగేసి అందులో ప్లాట్లుగా మార్చి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ దందా ఏ రేంజ్ లో జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుందని పలువురు పేర్కొనడం గమనించాల్సిన విషయం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెక్ పెట్టే విధంగా ఉన్నంత అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.