ఇల్లందులో హరిప్రియ గెలుపు సునాయాసమే-ఎంపీ రవిచంద్ర
టేకులపల్లి సభలో హరిప్రియ జిందాబాద్ అంటూ కార్యకర్తల జోరు
ఇల్లందు ప్రాంత బిడ్డగా నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దుతా టేకులపల్లి బీఆర్ఎస్ సభలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ బిఆర్ఎస్ పార్టీ సమావేశం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితలు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేకులపల్లిలో జై హరిప్రియ, జై బీఆర్ఎస్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. తదుపరి కేసీఆర్ దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పట్టు సాధిస్తారని, కేంద్రంలో కీలకపాత్ర పోషించనున్నారని జోస్యం చెప్పారు. ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన కేసీఆర్ గొప్ప నాయకులని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా బంగారు తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వార్థపూరిత రాజకీయాల కొరకు ఇల్లందు నుంచి పోటీచేసి ఓడిన నాయకుడిని కేసీఆర్ చేరదీసి జెడ్పీఛైర్మన్ పదవి కట్టబెడితే డబ్బు సంచులకు అమ్ముడుపోయాడని వారి ఆటలు సాగనివ్వమని స్పష్టంచేశారు. తానిక్కడకు పెత్తనం చేసేందుకు రాలేదని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గులాబీశ్రేణులను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపితే వచ్చానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అఖండ విజయం తథ్యమన్నారు. భారీ మెజారిటీతో హరిప్రియ గెలవబోతుందని పేర్కొన్నారు. ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. అదేవిధంగా ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ..వచ్చే ఎన్నికలలో ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ కథ కంచికే అన్నారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చి అన్నదాతకు అండగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ అని ఆయన పాలనలో తెలంగాణరాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా మారి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నాం అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తుంటే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గెలుపు సునాయసమే అన్నారు. ఇల్లందు ప్రజల కొరకు హరిప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయం అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కూడా హరిప్రియ నాయక్ విజయాన్ని ఆపటం ఎవరితరం కాదన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోకి తీసుకొచ్చానన్నారు. ఇల్లందు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒకఎత్తు అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఇల్లందు చరిత్రని తిరగరాసేవిధంగా భారీ మెజారిటీతో తాను గెలవడం ఖాయమన్నారు. అంతేకాకుండా నేటివరకు అధికార పార్టీ ఇల్లెందు నియోజకవర్గంలో గెలిచింది లేదని కాబట్టి ఇల్లందు చరిత్రను తిరగారాసి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ముఖ్యమంత్రికి బహుమతిగా ఇద్దామన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బీఆర్ఎస్ అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ సర్వే పూర్తిచేసుకుందని సీతారామ ప్రాజెక్టు పనులకోసం సీఎం కేసీఆర్ 3320 కోట్లు మంజూరు చేశారన్నారు. కొందరు ఇల్లందులో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఎమ్మెల్యే హరిప్రియ అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.