మన్యం న్యూస్,ఇల్లందు:చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసనలు, ధర్నా ఆందోళనలు చేయొద్దని కేటీఆర్ చెప్పటం దివాలాకోరు తనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు అరెస్టుకు నిరసనలు ఆందోళనలు తెలంగాణలో కాదు ఆంధ్రాలో చేసుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేకరాష్ట్రమా లేక కేటీఆర్ రాజ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ ను ఖండించిన కేసీఆర్, కేటీఆర్‌లు వారి కుటుంబానికి రాజకీయ ఉన్నతిని కల్పించిన చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడం వాళ్ల స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్రసమితిని భారత రాష్ట్రసమితిగా మార్చుకున్న వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఎందుకు నియమించాలని ఆ రాష్ట్రంలో వీళ్ళకేం సంబంధం అని ప్రశ్నించారు. తక్షణమే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజాక్షేత్రంలో తగినబుద్ధి చెప్తామని హెచ్చరించారు.