కాంగ్రెస్ లో ముదురుతున్న ముసలం
*పొంగులేటి వర్గానికి చుక్కెదురు
*పొమ్మనలేక పోగపెడుతున్న వైనం
గ్రూపు గొడవలతో కేడర్ లో సన్నగిల్లుతున్న స్థైర్యం
ఇల్లందు హస్తం కాకవికాలం
మన్యం న్యూస్, ఇల్లందు రూరల్: గత కొంతకాలంగా ఇల్లందు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపాన్ని చక్కదిద్ది ఏకతాటిపై నడిపించాల్సిన అధినాయకత్వం పేలవ ప్రదర్శన వల్ల రానున్న ఎన్నికల లోపు పార్టీ పూర్తిగా చతికిల పడేలా ఉంది. ఏరికోరి వచ్చి పార్టీలో చేరిన కోరం కనకయ్య ను నియోజక వర్గ స్థాయి పార్టీ కేడర్ గానీ అటు అధినాయకత్వం గానీ అక్కున చేర్చుకునే అవకాశం కనిపించట్లేదు పైగా చీటికి మాటికి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ పొమ్మనలేక పొగపెడుతున్న చందంగా తయారైంది. అలా కాక పొంగులేటి పట్టుతో బి ఫామ్ తెచ్చుకున్నా సొంతపార్టీ వారే వ్యతిరేకంగా పని చేసి ఓటమి పాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగిన తీరు చూస్తే స్పష్టం అవుతుంది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇరువురు పార్టీకి డోకా చేశారు అంటూ ఏఐసీసీ అబ్జర్వర్ పరమేశ్వర్ నాయక్ మాట్లాడటం, పిసిసి ఉపాధ్యక్షుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో గెలిచి పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్ ఇవ్వద్దనటం లాంటి మాటలతో ఇద్దరూ ను కోరం కనకయ్య ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరుతో కోరం వర్గం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏఐసీసీ అబ్జర్వర్ పరమేశ్వర్ నాయక్ హిందీ ప్రసంగాన్ని, ఇల్లందు ఏ బ్లాక్ అధ్యక్షుడు జలీల్ అనువదిస్తూ 2014, 2018 లలో గెలిచినవారు పార్టీని మోసం చేశారు అని ఉద్దేశ్య పూర్వకంగానే అనటంతో అక్కడే ఉన్న కోరం కనకయ్య మద్దతుదారులు ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేదికదగ్గరకు దూసుకొచ్చి మాటల యుద్ధం మొదలుపెట్టారు. జై కోరం అంటూ నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా మిగతా ఆశావహుల మద్దతుదారులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయసాగారు. సమావేశం గాడి తప్పిందని గ్రహించిన పరమేశ్వర్ నాయక్ కోరం కనకయ్య పై అసహనం వ్యక్తం చేయటంతో కనకయ్య తన మద్దతదారులతో సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సమావేశం రసాభాస గా మారింది. స్వయంగా ఒక ఏఐసీసీ అబ్జర్వర్ నిర్వహిస్తున్న ముఖ్యమైన సమీక్షా సమావేశం లో తలెత్తిన వివాదంతో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకా కాంగ్రెస్ గెలిచినట్లేనా అనుకుంటున్నారు.