ప్రభుత్వ స్కీం వర్కర్లను నిర్లక్ష్యం చేస్తే పతనం తప్పదు
* పండుగల వేల మహిళా వర్కర్లను శిభిరాలకే పరిమితం చేస్తారా
* డిమాండ్లు పరిష్కరించి సమ్మెలను నివారించండి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్, చిల్డ్రన్ పార్కు ఎదుట సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరసన శిభిరాన్ని కూనంనేని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరని వారి న్యాయమైన డిమాండ్లు సమస్యలు పరిష్కరించకుండా ఏండ్ల తరబడి ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటుందని అన్నారు. కనీస వేతనాలు చట్టబద్ధ హక్కుల అమలుకోసం ముఖ్య మంత్రి హామీ నెరవేర్చాలని అంగన్వాడీ సిబ్బంది ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. కనీసం చర్చలకు పిలిచి వారి సమస్యలు తెలుసుకోవాలన్న కనీస జ్ఞానం కేసీఆర్కు లేకపోవడం బాధాకరమన్నారు. పండుగలవేళ మహిళా వర్కర్లు కుటుంబాలను వదిలి రోడ్లపై ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి న్యాయమైన సమస్యలు డిమాండ్లు పరిష్కరించడం ద్వారా సమ్మెలను నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి డి.వీరన్న, అంగన్వాడీ, ఆశా విభాగాల సిబ్బంది కళావతి, పద్మావతి, శైలజ, జయ, లక్ష్మి, మనీలా తదితరులు పాల్గొన్నారు.