మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 05, కొమరం భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోండ్వానా రాణి, రాణి రుద్రావతి జయంతి వేడుకలను మండల కేంద్రంలోని కొమరం భీమ్ సెంటర్ నందు ఆదివాసి సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి రుద్రావతి చిన్నతనంలోనే యుద్ధ విద్యలు నేర్చుకొని తన భర్త మరణ అనంతరం గోండ్వానా రాజ్య పరిపాలన చేపట్టి రాజ్యంలో అనేక మార్పులు చేసి, ప్రజా రంజక పాలన కొనసాగించిందని తెలిపారు. తన రాజ్యం పైకి దండెత్తి వచ్చిన ఎంతోమంది రాజులను ఓడించిన ఘన చరిత్ర రాణి రుద్రావతి కే దక్కుతుందన్నారు. 1564లో మొఘలు రాజైన అసఫ్ ఖాన్ తో జరిగిన హోరాహోరీ యుద్ధంలో తీవ్రగాయాల పాలైన రుద్రావతి మొఘలు రాజు చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన సైనికుడ్ని నన్ను చంపమని కోరగా, నిరాకరించడంతో తన ప్రాణాలను తానే తీసుకొన్న త్యాగాన్ని గుర్తు చేశారు. నేటి ఆదివాసీ యువత ఆదివాసి వీరుల చరిత్రను తెలుసుకొని వారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో తెల్లం నరసింహారావు దొర, బచ్చల లక్ష్మయ్య, సోడే శ్రీరామ్, మడి రవి, బూరం రమేష్, వీరభద్రం, కోరం నరేష్, బూరుగు నరసింహారావు, పోతిని శ్రీకాంత్, సంగం నాగరాజు, రాకేష్, కట్రం సాగర్ తదితరులు పాల్గొన్నారు.





