మైనింగ్ కళాశాల సంపద లూటి!
* అక్రమంగా మట్టి తవ్వకాలు
* దర్జాగా పునాది రాయి తరలింపు
* ఎకరాల కొద్ది భూమి గుంటల మయం
* అడ్డుకుంటే బెదిరింపుల పర్వం
* ఆందోళనలో కాలేజీ యాజమాన్యం
* అడ్డుకట్ట వేసే నాథుడే లేడా అంటూ ప్రశ్నల వర్షం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అనేకమందిని మైనింగ్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలకు పూర్తిగా రక్షణ కరువైంది.. ఈ కళాశాలకు సంబంధించిన సంపద దర్జాగా లూటీ అవుతుంది. దొడ్డి దారిన తరలిపోతున్న సంపదపై ఇటు పోలీసులకు అటు అధికారులకు యాజమాన్యం ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల కలవరపెడుతుంది. స్వయంగా కాలేజ్ యాజమాన్య సిబ్బంది సంపదను లూటీ చేసే దొంగలను అడ్డుకుంటే వారికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇక కళాశాల యాజమాన్యం చేసేదేమీ లేక నిమ్మకుండిపోయింది. ఫలితంగా మైనింగ్ ఆస్తులకు తుప్పు.. సంపద లూటి అవుతుండడంతో అడ్డుకట్ట వేసే నాధుడే లేడా అంటూ విద్యార్థిని విద్యార్థులు తమ ఆవేదనను బహిరంగంగా వెల్లబుచ్చడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ దేవాలయం పక్కనున్న కాకతీయ యూనివర్సిటీ మైనింగ్ కళాశాలకు సరైన రక్షణ లేని కారణంగా సంపద దొంగల పాలవుతుంది. కాలేజీకి సంబంధించిన ఖాళీ భూములలో కొందరు అక్రమంగా తవ్వకాలు జరిపి ఎర్ర మట్టిని, ఇండ్ల నిర్మాణాలకు ఉపయోగించే పునాదిరాయిని తరలించుకుపోతున్నారు. ఈ తంతు గత కొన్ని నెలలుగా జరుగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. రాత్రి పగలు పెద్దపెద్ద యంత్రాలతో తవ్వకాలు జరిపి ఎర్రమట్టిని వేల రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త స్థలంలో గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని జెసిబిలతో తవ్వించి అందులో నుంచి బయటికి వస్తున్న పునాది బండరాయిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ అమ్మకాలు జరిపి లక్షల రూపాయలను జేబులో నింపుకుంటున్నారు. వందల ఎకరాల విస్తరణలో ఉన్న కళాశాలకు ప్రహరీ బౌండ్రి లేకపోవడంతో సంపద అక్రమార్కుల పాలవుతుంది. ఇటు భూమి అటు సంపద మాయమవుతుండడంతో విద్యార్థిని విద్యార్థులు కలవర పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కళాశాల అభివృద్ధికి ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని చదువుల సరస్వతి పుత్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.





