మన్యం న్యూస్, చర్ల:
2016 సంవత్సరం నుండి ఈ ఏడాది వరకు ఆగిపోయిన తునికాకు బోనస్ ను వెంటనే లబ్ధిదారులకు చెల్లించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పూసుకుప్ప జోన్ కన్వీనర్ దొడ్డి హరి నాగవర్మ నేతృత్వంలో భారీగా గిరిజనులు స్థానిక అటవీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని గిరిజనుల కష్టాలు తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూసుగుప్ప ఆదివాసీలు అటవీ అధికారి కార్యాలయం ఎదుట సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరాండమును చర్ల రేంజర్ ఉపేంద్ర కు సిపిఎం పార్టీ నేతృత్వంలో ఆదివాసీలు అందివ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన రేంజర్ ఉన్నదా అధికారులకు నివేదిక పంపిస్తానని త్వరతిగతిన తునికాకు బోనస్ లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో పడే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. చిన్నచిన్న టెక్నికల్ సమస్యల వలన బ్యాంకుల్లో డబ్బులు జమ కావడం లేదని అందరికీ డబ్బులు వస్తాయని ఎవరూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదని కొద్దిగా సమన్వయం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు పి.సమ్మక్క, పూసుగుప్ప మాజీ సర్పంచ్ ఉయిక రామకృష్ణ, పెద్ద ఎత్తున పూసుగుప్ప గిరిజనులు పాల్గొన్నారు.





