తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దీవించండి
* ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఆస్కారం ఉండదు
* తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దీవించాలని
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఆస్కారం ఉండదని చందాలు దందాలు చేసే వారికి మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం చుంచుపల్లి తండా గంగా హుసేన్ బస్తీలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకుని బయలుదేరారని ఆ డబ్బులు తీసుకోండని పిలుపునిచ్చారు. అవి మీవే మీ దగ్గరే వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులని వాటిని తీసుకుని రాబోయే ఎన్నికల్లో మీ మనసులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో దానికి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మనస్ఫూర్తిగా దీవించాలని పేర్కొన్నారు.
ఎంతో మంది ఉద్యమకారులు మేధావులు అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో వారి కలలు కలలుగానే మిగిలి పోయాయన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కానుకగా ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చందాలు దందాలు అవినీతి అక్రమలే రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రజల అశీస్సులు దీవెనలతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఏ మాత్రం ఆస్కారం ఉండదని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ ప్రకటించిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలు చేసి చూపిస్తామని ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేసి వారికి న్యాయం చేసిందని అన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వారికి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు. లిక్కర్ దందాలో ఉన్న తన కూతురు కవితను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందన్నారు. ఇంకా ఎన్నో లోపాయికార ఒప్పందాలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్నాయని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మహిళలకు నిరుద్యోగులకు వృద్దులకు రైతులకు ఇంకా అనేక వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయాలను అందచేశారు. అదేవిధంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, పెద్ద బాబు, కనకరాజు, ఆయూబ్ ఖాన్, శివా రెడ్డి, దేవరగట్ల ప్రసాద్, గౌస్ పాషా, నాగేందర్, సతీష్ , పండు, నరేష్, నాగేశ్వరరావు, ఆవుల మధు తదితరులు పాల్గొన్నారు.





