UPDATES  

 సింగరేణి ఎన్నికలను ఆపటం యాజమాన్యం కుట్ర ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్

 

మన్యం న్యూస్,ఇల్లందు:సింగరేణి ఎన్నికలను ఆపటం ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర అని ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధానకార్యదర్శి కే. సారయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ లుబుధవారం సంయుక్తంగా ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం 2017వ సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం నాలుగు సంవత్సరాల కాలపరిమితితో గెలిచినప్పటికీ వెండిగిన్నెలు, వెండిగ్లాసులు, వంటపాత్రలు, డిన్నర్ సెట్లు ఇచ్చి గెలిచిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రలేబర్ డిపార్ట్మెంట్ ఈ అవినీతికరమైన గెలుపుని తిరస్కరిస్తూ టీబీజీకేఎస్ గుర్తింపు కాల పరిమితిని రెండుసంవత్సరాల కాలానికి పరిమితం చేసి టీబీజీకేఏస్ కి సర్టిఫికెట్ ప్రధానం చేసిందన్నారు. దానిప్రకారం సింగరేణిలో తిరిగి 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆరుసంవత్సరాల కాలంపాటు జెసిసి సమావేశాలు, ఎలాంటి పోరాటాలు, అగ్రిమెంట్లు లేకుండా టీబీజీకేఎస్ అధికారంలో కొనసాగిందని దీనివల్ల కార్మికవర్గానికి తీవ్రనష్టం జరిగిందని దుయ్యబట్టారు. కార్మిక సంఘాలన్నీ తిరగబడి 2022వ సంవత్సరంలో తొమ్మిది అంశాలమీద అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ వాటిని అమలుకాకుండా సింగరేణి యాజమాన్యం, టీబీజీకేఎస్ తొక్కిపట్టాయని ఆ కారణంగా కార్మిక పక్షపాతిగా ఎఐటియుసి గతేడాది హైకోర్టును ఆశ్రయించి సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేయగా హైకోర్టు సింగల్ బెంచ్ మార్చినెలలో సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని యాజమాన్యాన్ని ఆదేశించిందని కానీ యాజమాన్యం హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరించి కంపెనీ ఉత్పత్తికి విఘాతం కలుగుతుందన్న సాకునుచూపి జూన్ నెలకు ఎన్నికలు వాయిదాను కోరిందని పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని అర్థం చేసుకున్న సింగిల్ బెంచ్ కోర్టు ఈ ఏడాది అక్టోబర్ 28న ఎన్నికలు పెట్టడానికి లేబర్ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. దాంతో సకల ప్రభుత్వశాఖలను ప్రభావితం చేసి ఎన్నికలకు ముందుకు వచ్చినటువంటి కార్మికసంఘాలను చీల్చి, కొన్నిసంఘాలతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికలు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని కుట్రపూరితంగా వ్రాయించుకొని కోర్టులో పిటిషన్ వేసిందని కానీ మేనేజ్మెంట్ వేసిన ఈ అప్పీల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈలోగా అక్టోబర్ 6, 7తేదీల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా 15 కార్మికసంఘాలు ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధపడుతూ నామినేషన్లు దాఖలు చేశాయని దీనితో కలవరపడ్డ యాజమాన్యం, ప్రభుత్వం టీబీజీకేఎస్ 13 కార్మికసంఘాల అభిప్రాయాల్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీల ఉత్తరాలని పట్టుకుని హైకోర్టు ఫుల్బెంచీకి వెళ్ళిందన్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయల సింగరేణి డబ్బును ఖర్చుపెట్టి కార్మికులు కోరుకుంటున్న ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కుట్రను కార్మికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అన్నారు. సింగరేణిలో ఎన్నికలు వాయిదా పడడానికి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్, 13 కార్మికసంఘాలు యాజమాన్యానికి ప్రభుత్వానికి వంతపాడాయని కార్మికవర్గ ప్రయోజనాలకు, కోర్కెలకు భిన్నంగా సింగరేణి ఎన్నికల వాయిదా వేయించగలిగారని ఇది కార్మికవర్గ ప్రయోజనాలకు తీవ్రనష్టం వాటిల్లింది అన్నారు. నిత్యం కార్మికుల కోసం, కంపెనీ రక్షణకోసం కార్మికవర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఏఐటీయూసీ ఎన్నికల కోసం చేయగలిగినంత కృషిని గమనించాల్సిందిగా కార్మికవర్గానికి వారు విజ్ఞప్తిచేసారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !