బీఎస్పీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు
* ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావాన్ని అరికట్టాలి
* బీసీలకు 60 నుండి 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తాం
* పోలీసు రెవెన్యూ అధికారులు కేసీఆర్ కు తొత్తులు
* బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బీఎస్పీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను
రద్దు చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని రానున్న ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికార బీఅర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి వ్యవహారించే పోలీసు రెవిన్యూ అధికారులపై త్వరలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. బుధవారం కొత్తగూడెం
క్లబ్ లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి యెర్రా కామేష్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభకు ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టడంలో పోలీసులు విఫలమైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొత్తులుగా మారారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకొని అరికట్టాలన్నారు. పొడు భూములకు పట్టాలు ఇవ్వడంలో బీఅర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఅర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుతున్నారు కానీ బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించడంలో వివక్ష చూపుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60-70 అసెంబ్లీ సీట్లు తమ పార్టీ కేటాయిస్తుందని అన్నారు. కోట్ల రూపాయల డబ్బు ఉన్న అవినీతి పరులకు వచ్చేఎన్నికల్లో బుద్ది చెప్పి చదువుకున్న యువకుడు నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే బీఎస్పీ అభ్యర్ధి కామేష్ ను గెలిపించాలని కోరారు. భద్రాచలం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. భద్రాచలం రామయ్యను కన్నెత్తి చూడని తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కిన్నెరసాని తాగునీటి పథకం పైపులైన్ల లీకేజీ మరమ్మతులకు కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయుటకు ముఖ్యమంత్రికి చిత్తశద్ధి లేదన్నారు. బొగ్గు రవాణా ద్వారా వందల కోట్ల ఆదాయం వస్తున్నా కొత్త రైళ్లు ఏర్పాటు చేయకపోగా ఉన్న రైలు మార్గాలను తొలగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు మౌనం వహించి కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మనెంట్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ స్థాయిలో విద్యనందించి విదేశాల్లో చదివేలా ప్రత్యేక విద్యా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ జనాభా నిష్పత్తి ప్రకారం పంచుతామన్నారు. కొత్తగూడెం పట్టణానికి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని కిన్నెరసాని మురికి నీరు వస్తుందని విమర్శించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కు ఘన స్వాగతం…
కొత్తగూడెం కి వచ్చిన బిఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కు బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్ నుండి మొదలైన సూపర్ బజార్, గణేష్ టెంపుల్, రైల్వే అండర్ బ్రిడ్జి, ఆర్టీసీ బస్టాండు మీదుగా కొత్తగూడం క్లబ్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వేలాది మంది పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ అభ్యర్థి యెర్రా కామేష్, జిల్లా అధ్యక్షులు ఇర్పా రవికుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి, స్వెరోస్ జిల్లా అధ్యక్షుడు హరిబాబు, సాయి, సిర్ల మణీసాయి, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.