మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నియజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి యెర్రా కామేష్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలోని వర్గ విబేధాలు కాంగ్రెస్ లోని కుమ్ములాటలు కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం పడుతున్న ఆరాటం ఇవ్వన్నీ ప్రజలకు వివరించాలన్నారు. నాలుగున్నర ఏండ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన తనయడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అనుచరులు చేస్తున్న భూకబ్జాలు అవినీతి అరాచకాలపై నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న తనకు రానున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. అభివృద్ధి అంటే ప్రజలకు చేరువ కావాలని కానీ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి నిధులు అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళయని ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి బీఎస్పీకి అవకాశం ఇవ్వాలని ప్రజా జీవితంలో అనేక ఒత్తిడిలను తట్టుకొని నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్న తనకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, సాయి, జిల్లా సహాయ కార్యదర్శి చేనిగారాపు నిరంజన్ కుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.