మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయవాదుల సమస్యలను తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరుతూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్ర ప్రధాన బాధ్యులను కలిసి వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డిని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్ల రాష్ట్ర నాయకత్వం కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. ఇటీవల కాలంలో న్యాయవాదులపై విపరీతంగా పెరిగిన భౌతిక దాడులను అరికట్టడం కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుండి ప్రతి ఈటా ఇస్తున్న ఆరోగ్య బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలు పెంచాలని రాష్ట్రంలోని యువ న్యాయవాదులకు బీమా కవరేజీని విస్తరింపచేయలని అయిదు సంవత్సరాల కంటే తక్కువ స్టాండింగ్ ఉన్న యువ న్యాయవాదులకు ప్రతి నెల పదివేల రూపాయలు స్టైపెండ్ అందించి కారు వృత్తిలో నిలబడేలా చర్యలు తీసుకోవాలని అవసరమున్న పేద న్యాయవాదులకు ఇళ్ల స్థలం లేదా డబుల్ బెడ్రమ్ కేటాయించాలని న్యాయవాదుల సంక్షేమానికి 500 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణాలో 41 ఏ సి.ఆర్.పి.సి.ని సవరించాలని కోరారు.
ఈ సమస్యలను ఎన్నికల ప్రణాళికలో పొందు పరచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ వినతి పత్రాన్ని మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పంపిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఫెడరేషన్ ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ల ఫెడరేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ (నాంపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్ ఢీకొండ రవీందర్ (రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి (మేడ్చల్ మల్కాజిగిరి), రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ (కొత్తగూడెం)తదితరులు పాల్గొన్నారు.