UPDATES  

 నన్ను మించిన అద్భుతం: ఆరడుగుల బుల్లెట్ అంటూ హరీశ్ రావుపై కేసీఆర్, దాబాలో చాయ్

తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సిద్దిపేట అంటేనే ఒక గౌరవం, ప్రత్యేకత ఉందని..

తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

సిద్దిపేట పేరు వింటే స్వర్గం కంటే నా జన్మభూమి గొప్పదనే భావన కలుగుతుందని కేసీఆర్ అన్నారు. ప్రతీ సందర్భంలో సిద్దిపేట తనను విజేతగా నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటలో మంచినీళ్ల కరవు వస్తే.. వాటర్‌ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మిషన్​ భగీరథ పథకం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది అని కేసీఆర్ పేర్కొన్నారు.

సిద్దిపేటలో తాను తిరగని రోడ్డు, గ్రామం, చెరువు లేదన్న సీఎం.. ఒకప్పుడు బంగారం లాంటి భూములు ఉన్నా పంటలు పండించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందే సిద్దిపేట గడ్డ అన్నారు. 50 సంవత్సరాల పాటు సిద్దిపేట ప్రజలతో కలిసి మెలిసి బతికానని చెప్పారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహ్మాండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశారని కేసీఆర్ కొనియాడారు. తన కంటే బాగా పనిచేస్తున్నారన్నారు. ఇక సిద్దిపేటకు అన్ని వచ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.

నేను సిద్దిపేటను విడిచి వెళ్లిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో నేను తీసుకొచ్చి ఓ ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌ను మీకు అప్పగిస్తే.. బ్రహ్మాండంగా నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా పని చేసి నా మాటను నిలబెట్టాడు. మీ గౌరవాన్ని కాపాడాడు అని ప్రశంసల వర్షం కురిపించారు కేసీఆర్. నిజంగా హరీశ్ జాగలా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుదోనో లేదో నాకు తెల్వదు. అంత అద్భుతంగా పని చేస్తున్నారు అని కేసీఆర్ కొనియాడారు.

నేను ఇంతకన్న ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దిపేటకు నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తల్లు దుంకుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సంతోషపడుతున్నాను. నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాంలు చూసినప్పుడు బ్రహ్మాండంగా మనసు పులకించి పోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !