బీఆర్ఎస్ మేనిఫెస్టోను అడ్డగోలుగా పెట్టలేదని ఈరోజు సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాదం సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన ఆయన తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు.
కలలో కూడా ఊహించని అభివృద్ధి ఇప్పుడు జరిగిందని ఆయన పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల జీవితంలో వందలసార్లు తను సిరిసిల్లలో తిరిగానన్నారు. అప్పట్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై గోడలపై ప్రభుత్వం రాసిన రాతలు తనని కలచి వేశాయని పేర్కొన్నారు. కొందరు బతుకమ్మ చీరలు తగలబెడుతున్నారని, చేనేత కార్మికులను కాపాడటం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.
అప్పట్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని, తమ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. సిరిసిల్ల మరో సోలాపూర్ మాదిరిగా అవుతుందన్నారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి తెచ్చామని రైతుల కష్టాలు తెలుసు కాబట్టే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులను ధరణిలో రైతులకు అందించామని అలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు.
రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడం కోసమే ధరణి తెచ్చామన్నారు. దాన్ని రద్దుచేసి రైతులను ఆగం చేసే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నారన్నారు. ధరణి లేకుండా చేయాలని కాంగ్రెస్ వాళ్లు చూస్తున్నారని అలాంటి కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్నారు. పదేళ్ల అభివృద్ధిని నాశనం చేయాలని చూసే వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.
సమైక్య పాలనలో అప్పర్ మానేరు దుమ్ములేసేదని, పూర్తిగా నాశనం అయిందని కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో ఎండాకాలంలో కూడా మత్తడి తొక్కుతుందన్నారు. రేషన్ కార్డుదారులు అందరికీ సన్న బియ్యం ఇస్తామని, ఓట్ల కోసం తాము అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు బ్రహ్మాండంగా బాగుపడే వరకు తాము విశ్రమించమని అన్నారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు .
ఇదే రీతిలో కరెంట్ కావాలంటే, రైతుల భూములు క్షేమంగా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరగాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటలు తాను వినలేదని పేర్కొన్న కెసిఆర్, తెలంగాణలో హిందువులకు ముస్లింలకు గొడవలు లేవని ,ప్రతిపక్షాలు కావాలని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అబద్దాలతో ఆపద ముక్కలతో వచ్చేవారిని నమ్మవద్దని కెసిఆర్ పేర్కొన్నారు.