తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల బరిలో ఉండే నేతలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెడుతున్నారు. ఓటర్ల మనసు గెలుచుకునేందుకు అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు.
తమ ఇష్ట దైవాలను పూజించి, ఎన్నికల కురుక్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన వారంతా ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారంలోకి దిగారు.
ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పానగల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉండబోతున్న పిల్లి రామరాజు యాదవ్ కూడా పానగల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి తన ప్రచారాన్ని ప్రారంభించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అవంతీపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ కూడా ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి పార్టీ చేరికల కార్యక్రమాలను కొనసాగిస్తు ప్రచారంలో ఉన్నారు.
ఇక మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి చౌటుప్పల్లో తమ పార్టీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు ప్రజా క్షేత్రంలో అమీ తుమీ తేల్చుకోవటం కోసం రెడీ అయ్యారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఈ ఉదయం నకిరేకల్ లోని కనకదుర్గ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. మొత్తంగా అందరు నేతలు ఓటర్ల మనసు గెలుచుకోవడం కోసం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.