ఎర్ర జెండా గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలి
* ప్రజలను దగా చేసిన కేసీఆర్ గద్దె దిగడం ఖాయం
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సిపిఐ పోటీ చేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలో ఎర్ర జెండా గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో బుధవారం జరిగిన సిపిఐ కొత్తగూడె పట్టణ స్థాయి విస్తృత కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గతం కంటే ప్రజాదరణ పెరిగిందని ప్రతీ గ్రామం బస్తీలో అనునిత్యం ప్రజలకు సేవలందించే కార్యకర్తలు ఉన్నారన్నారు. సమస్యలపై స్పందిస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఫలితంగానే జనం సిపిఐని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం చతికలపడిందని రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని మళ్లీ గద్దెనెక్కినా ఓరిగేదేమీలేదన్నారు. బిఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మెనిఫేస్టో ఒట్టి బూటకమని ప్రజలను మభ్యపెట్టి మరోసారి మోసం చేసి గద్దెనెక్కేందుకేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా అమలు చేసిన సంక్షేమ పథకాలు సైతం గులాబీ నేతల జేబులు నింపేందుకే తప్ప ప్రజలకు బ్రతుకులు బాగుచేయలేదన్నారు. ప్రతీ పథకంలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. బంగారు తెలంగాణాగా మారుస్తామని అధికారం చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా ఆకలి తెలంగాణగా మార్చారని రాష్ట్ర ఎందుకు సాధించుకున్నామా అనే పరిస్థితిలో ప్రస్తుతం ప్రజల్లో నెలకొందన్నారు. ప్రజలను అడుగడుగునా దగి చేసిన కేసీఆరు ను ఈ దఫా గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జిడ్డు నగేష్, వంగ వెంకట్, భూక్యా శ్రీనివాస్, పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు బోయిన విజయ్ కుమార్, పి.సత్యనారాయణాచారి, తదితరులు పాల్గొన్నారు.