మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- బీఆర్ఎస్ పార్టీని వీడిన నమ్మకద్రోహులకు త్వరలో కనువిప్పు కలుగుతుందని ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. మంగళవారం ప్రచార కార్యక్రమంలో భాగంగా బోజ్జాయిగూడెం గ్రామపంచాయతీ కొల్లాపురం గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు హరిప్రియ నాయక్ దగ్గరికి వచ్చి పూర్తి సంఘీభావం తెలిపారు. అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు. హరిప్రియ నాయక్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఆణిముత్యాలు లాంటి కార్యకర్తలు ఉన్నంతవరకు బీఆర్ఎస్ కు ఎలాంటి డోకా లేదన్నారు. ఒక్క నాయకుడు వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీలు మారడం మూర్ఖత్వం అన్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించి పార్టీలు మారిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు ప్రజలు దీటైన జవాబు ఇస్తారన్నారు.
నాయకులు వెళ్లిన ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలు తనతో నిలబడటం మరిచిపోనన్నారు. కొల్లాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని అన్నారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తానని కొల్లాపూర్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. చెమటోడ్చి పార్టీ అభివృద్ధి కోసం శ్రమించి పనిచేసే కార్యకర్తల ఉత్సాహం, అభిమానం, ఆశీర్వాదం తనతో ఎల్లప్పుడూ ఉన్నాయి, ఉంటాయి అన్నారు.
పార్టీలు మారిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.