మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలో ఇక దొరల పాలనను కొనసాగనివ్వమని కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. యువతకు ఉపాధి కాంగ్రెస్ మిత్ర పక్షాల గెలుపుతోనే సాధ్యమవుతుందని వారు తెలిపారు. కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ లో భారీ రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ సందర్బంగా తుమ్మల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రధానమైన ఆరు హామీలను నెరవేరుస్తామని తెలిపారు. ప్రతి మహిళ ఖాతాలో ప్రతి నెల రూ. 2,500 జమ చేస్తామని, ప్రతి మహిళకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రైతు భరోసా పేరుతో
రూ.15వేల పెట్టుబడి సాయం అందించడంతో పాటు కౌలు రైతులకు రూ.12వేలు అందిస్తామని తెలిపారు. ధాన్యం గిట్టుబాటు ధరకు రూ.500 అదనంగా కలిపి ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ మిత్ర పక్షాలుగా పోటీ చేస్తున్నాయని కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇక్కడ కూనంనేని కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, టిడిపి, టిజెఎస్ నాయకులు పాల్గొన్నారు.