తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. టీఎస్ పీఎస్సీకి సంబంధించిన ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లపై చర్చించారు. అనంతరం అనూహ్యంగా జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. దీంతో రేవంత్ రెడ్డితో భేటీలో ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
2021 మేలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయి. అసలే బీఆర్ఎస్ సర్కార్ నీళ్లు నిధులు నియామకాల పేరుతో జనంలోకి వెళ్తున్న సమయంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండి నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. అప్పట్లోనే జనార్ధన్ రెడ్డి రాజీనామా చేస్తారని అంతా భావించారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల్ని ప్రభుత్వమే అంగీకరించి విచారణ చేయించాల్సిన పరిస్ధితులు రావడంతో బీఆర్ఎస్ సర్కార్ ను విపక్షాలు ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. చివరికి ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంప ముంచాయి కూడా. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని భావించినా ఆయన అలా చేయలేదు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో టీఎస్పీఎస్సీ సమీక్షలో కూడా పాల్గొన్న ఆయన అనంతరం రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారుల్ని పిలిపించుకుని సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టే ఉద్యోగాల భర్తీపై చర్చించారు. అలాగే అక్రమాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కూడా తగు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనార్ధన్ రెడ్డి రాజీనామా కూడా కోరారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.