తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే . ఈ పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తుంది. దీంతో ఇప్పుడు బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం హైదరాబాద్ మెట్రో రైళ్లపై పడుతుంది.
మహాలక్ష్మి పథకం ప్రారంభం కావడానికి ముందు హైదరాబాద్ మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ ఉండేది. హైదరాబాద్లో ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది మెట్రో రైల్ లో ప్రయాణం చేసి గమ్యస్థానాలకు వెళ్లేవారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తిని చూపేవారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని పెద్దసంఖ్యలో మెట్రో రైల్లో ప్రయాణం చేసేవారు.
Mahalakshmi scheme free buses effect to metro trains!!
ప్రస్తుతం ఉచిత బస్సుల పుణ్యమాని మెట్రోరైళ్లకు రద్దీ తగ్గుతుంది. బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలంతా ఉచితబస్సుల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తిని చూపిస్తుండడం మెట్రో రైళ్ళలో రద్దీ తగ్గడానికి కారణంగా మారింది. ఇంతకుముందు ప్రతిరోజు సగటున మెట్రో రైళ్లలో ఐదు లక్షల మంది ప్రయాణం చేసేవారు కానీ మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు 50 వేల వరకు మెట్రో రైల్ లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతున్నట్టుగా అంచనా.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వేల బస్సులు ఉన్నప్పటికీ అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని తట్టుకోలేక పోతున్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులలో నిత్యం పది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య అమాంతం పెరిగి నిత్యం ఆర్టీసీ బస్సులలో 15 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఒక్కసారిగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఐదు లక్షల మంది ప్రయాణికులు అదనంగా పెరిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక మెట్రో రైల్స్ మాత్రం వెలవెలబోతున్నాయి. అయితే ఈ విషయంలో మెట్రోలో ప్రయాణిస్తున్న పురుషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు పెట్టి మంచి పని చేశారని తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగుతుందని కొందరు చెబుతున్నారు.
ప్రస్తుతం కొత్తగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న క్రమంలో వేలం వెర్రి లాగా ప్రయాణాలు చేస్తున్న మహిళలు కొద్ది రోజులకు ఆ క్రేజ్ నుంచి బయటకు వస్తారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరి కొద్ది రోజులు ఆగితే మెట్రో పై ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం ప్రభావం ఏ విధంగా ఉంటుందో కచ్చితంగా చెప్పవచ్చని అధికారులు భావిస్తున్నారు.