UPDATES  

 నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్స్..!

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం నేడు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. కాగా నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనుండగా.. గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

 

సహజంగా అధికార పార్టీ స్పీకర్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతుంటారు. అయితే ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా నియమితులైతే తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. ప్రస్తుత తెలంగాణ శాసన సభలో అత్యధిక మంది సభ్యులు అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ క్రమంలో స్పీకర్‌ పదవిని దళిత నేతకు ఇస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గడ్డం ప్రసాద్.. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌ లలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 

అయితే…. ఆ తర్వాత వచ్చిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ వరుసగా ఓడిపోయారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ.. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !