UPDATES  

 కశ్మీర్ విలీన చరిత్రను వక్రీకరుస్తున్న మోదీ ప్రభుత్వం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో అర్కైవ్స్‌లోని నాటి ఉత్తరాలను గార్డియన్ పత్రిక వర్గీకరిస్తూ నివేదికలు తయారుచేసింది. వాటి ప్రకారం, నిజానికి నాటి భారత సైన్యంలో తనకు అత్యంత విశ్వసనీయ సలహాదారుడి సలహా మేరకే నెహ్రూ ఈ పనిచేసినట్లు తెలిసింది. కాశ్మీర్‌లో కొనసాగే సైనిక చర్యను భారతదేశం ఎక్కువ కాలం తట్టుకోలేకపోతుందని సదరు సైనిక అధికారి నెహ్రూను హెచ్చరించినట్లు అందులో పేర్కొని ఉంది. అందుకే, ఈ సమస్యకు రాజకీయ రాజీ అవసరం ఉన్నట్లు అధికారి వెల్లడించారు. అందుకే, నవంబర్ 28, 1948 నాటి నెహ్రూకు తన లేఖలో, బుచెర్ అనే ఈ అధికారి కాశ్మీర్‌లోని భారత సైనికుల్లో అలసట గురించి ప్రస్తావించాడు. అందులో “మొత్తం సైనిక నిర్ణయం ఇకపై సాధ్యం కాదు” అని చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై నెహ్రూ స్పందిస్తూ, వాయు మార్గం ద్వారా భారత స్థావరాలపై బాంబులు వేయాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు.

 

అయితే, జనవరి 1949న ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది. ఆ సంవత్సరం తర్వాత నెహ్రూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అందించారు. ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తిని ఇచ్చారు. దశాబ్దాలుగా, కాశ్మీర్ సమస్య, తదనంతర సరిహద్దు వివాదంపై భారతదేశం, పాకిస్తాన్ మరో మూడు యుద్ధాలు చేశాయి. ఏది ఏమైనప్పటికీ, నెహ్రూ అందించిన ఆర్టికల్ 370లోని చర్యలు కాశ్మీరీలు ముస్లిం-మెజారిటీ రాష్ట్రంలోని భారతదేశ-నియంత్రిత ప్రాంతాల్లో తమ హక్కులను కాపాడుకోవడంలో కీలకమైనవిగా భావించారు. ముస్లిం-మెజారిటీ అయితన పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించారు. కానీ 2019లో, హిందూ జాతీయవాది మోడీ నాయకత్వంలో, భారతదేశంలో పూర్తిగా విలీనం చేసే ప్రయత్నంలో ఢిల్లీ అధికారికంగా రాష్ట్ర రాజ్యాంగ స్వయంప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఈ ప్రాంతంపై ప్రభుత్వ పట్టును పెంచింది. అదే సమయంలో ప్రాంతీయులకు ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇక, అధికార బిజెపి నేతలు నెహ్రూ తప్పు చేశాడని చెప్పడం ద్వారా నెహ్రూతో పాటు కాంగ్రెస్‌ను నిందించడమే లక్ష్యంగా కనిపిస్తుంది. పాకిస్తానీ దళాల నుండి ఎక్కువ భూభాగాన్ని లాక్కోవడంలో నెహ్రూ సరైన నిర్ణయం తీసుకోలేదంటూ నిందించింది. 2019లో కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలాంటి వాఖ్యలే చేశాడు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో పాకిస్థాన్‌తో రాజీ కుదుర్చుకోవాలనే నిర్ణయం నెహ్రూ “అతిపెద్ద తప్పు” అని, ఇది “హిమాలయన్ బ్లండర్” అని విమర్శించారు. “భారత్ యుద్ధంలో గెలవబోతున్నప్పుడు కాల్పుల విరమణ ప్రకటించాల్సిన అవసరం ఏంటి?” అని అమిత్ షా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇటీవల బయటపడిన బుచెర్ పేపర్లు, లేఖలను బట్టి, అప్పుటి పరిస్థితులను బట్టి నెహ్రూ తన సైనిక అధికారుల నుండి అందిన సమాచారం మేరకు పనిచేశారని తెలుస్తుంది.

 

బ్రిటీష్ అధికారి అయిన బుచెర్‌కు, భారత సైనిక కార్యకలాపాలతో పరిచయం… బ్రిటిష్ భారతీయ సైనిక సిబ్బంది మధ్య అంతరాన్ని తగ్గించడంలో సామర్థ్యం ఉన్న కారణంగా స్వాతంత్య్రానంతర భారతదేశంలో బుచెర్‌ను భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా ఎంపిక చేశారు. అతను 1948, 1949 మధ్య పదవీ విరమణ వరకు పనిచేశాడు. భారతదేశంలో అత్యున్నత సైనిక పదవిని కలిగి ఉన్న చివరి విదేశీయుడు ఇతను. అయితే, ఇలాంటి కొన్ని బుచెర్ పేపర్ల వర్గీకరణను కనుమరుగు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వాటిని “సున్నితమైనవి”గా అభివర్ణిస్తున్నట్లు గార్డియన్ మీడియా గత నెలలో నివేదించింది. గార్డియన్ నివేదికలను గమనించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ… సదరు లేఖల్లోని విషయాలను ఇంకా వర్గీకరించకూడదని పేర్కొన్నట్లు గార్డియన్ నివేదించింది. అనేక దశాబ్దాలుగా, ఇలాంటి ఎన్నో పత్రాలు 1970 నుండి భారతదేశ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలో న్యూఢిల్లీలో ఉన్నాయి. సంవత్సరాలుగా, ఈ పత్రాలను వర్గీకరించడానికి వాలంటీర్లు అనేక విఫల ప్రయత్నాలు చేశారు. ఇక, బుచెర్ కరస్పాండెన్స్‌తో కొన్ని కాపీలు లండన్ నేషనల్ ఆర్మీ మ్యూజియంలో కూడా ఉన్నాయి. వాటి నుండి కొన్నింటిని గార్డియన్ నివేదించినట్లు తెలుస్తుంది.

 

ఆగస్టు 15 నుండి అక్టోబరు 26, 1947 వరకు కాశ్మీర్ స్వతంత్రంగా ఉన్న రోజుల్లో… భారతదేశం, జమ్మూ కాశ్మీర్ మధ్య కమ్యూనికేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో జమ్మూ నుండి కఠువా వరకు రహదారి మెటలింగ్ కూడా ఉండేది. తద్వారా అవసరమైన సామాగ్రి, సైనిక దళాలు అత్యవసర పరిస్థితుల్లో భారత భూభాగం నుంచి కాశ్మీర్‌కు తరలించవచ్చు. నిజానికి, కాశ్మీర్ ఒక సంక్లిష్టమైన భూభాగం. అప్పట్లో ఆ రాష్ట్రాన్ని పాలించే డోగ్రా, పండిట్ అనే ఉన్నత వర్గాలు, పేద ముస్లిం మెజారిటీ మధ్య విస్తృత ఆర్థిక అంతరం ఉండేది. ఇక్కడ ఉన్నత వర్గాలు తప్ప చాలా మంది రైతులు భూమిలేని రైతులుగానే జీవించేవారు, జీవిస్తున్నారు. అలాగే, 50 నుండి 75 శాతం ఉత్పత్తి డోగ్రా పాలకుల వద్దకు వెళ్లింది. డోగ్రాలు బేగార్… అంటే నిర్భంద శ్రమ వ్యవస్థను కూడా తిరిగి ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆగస్ట్ 14-15, 1947లో కాశ్మీర్‌లోని చాలా పోస్టాఫీసులపై పాకిస్తాన్ జెండాను ఎగురవేసారు అక్కడున్న ముస్లిం మెజారిటీ. ఇది చాలా మంది కాశ్మీర్ ముస్లీమ్‌లకు పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి, క్లిష్టమైన పరిస్థితుల్లోనే కాశ్మీర్‌పై భారతదేశం దావాకు చట్టబద్ధత కల్పించే మిత్రుడు నెహ్రూకు అవసరమయ్యాడు. అలా వచ్చిన షేక్ అబ్దుల్ సాహెబ్ నుండి పరిణామాలు మారుతూ వచ్చాయి.

 

అయితే, జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన బిల్లులను ఆమోదించే సందర్భంలో… సమగ్రమైన చర్చకు తావివ్వకుండా… నెహ్రూ ప్రస్తావనతో బిజెపి తప్పించుకుంటుందని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అసలు, సమస్యలను పక్కన పెట్టి, జాతీయ నేత, భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిలదీస్తూ రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పండిట్ నెహ్రూ భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. నెహ్రూ చాలా సంవత్సరాలు జైలులో గడిపారు. అమిత్ షాకి చరిత్ర తెలియదు. చరిత్రను తిరగరాయడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే, అమిత్ షాకి చరిత్ర తెలుస్తుందని కూడా నేను అనుకోను. అసలు సమస్యల నుంచి ప్రజలను మళ్లించేందుకే ఈ అంశాలన్నీ బీజేపీ లేవనెత్తింది” అని రాహుల్ గాంధీ అన్నారు.

 

2019లో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు విషయం పక్కన పెడితే… పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి సాధించుకోవడంలో ఎలాంటి అభ్యంతరమూ ఎవ్వరికీ లేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఇందులో కాంగ్రెస్ వాదన కూడా స్పష్టంగానే ఉంది. గత పదేళ్లుగా బిజెపి అధికారంలో ఉంది. దానికి ముందు ఆరేళ్ల కాలం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఉంది. ఈ కాలంలో పీఓకేను సాధించడంలో బిజెపి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు..? అనేది వారి ప్రశ్న. ఆ కాల పరిస్థితులను బట్టి జాతీయ సమస్యను నెహ్రూ సున్నితంగా డీల్ చేశారు. అయితే, 2024 ఎన్నికలకు ముందే పీఓకెను వెనక్కు తీసుకొస్తే మేమూ కూడా సంతోషిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. నాటి జాతీయ నాయకుల నుండి నేటి దేశ భక్తుల వరకూ మాతృదేశం నుండి అడుగు భూమి పోయినా ఎవ్వరూ సహించరు. అది చైనా అయినా, పాకిస్థాన్ అయినా మూల్యం చెల్లించాలనే అనుకుంటారు. అయితే, దాన్ని ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించకుండా… గత చరిత్రను తవ్వడంలో ఉపయోగం ఏముంటుందనేది విశ్లేషకులు కూడా చెబుతున్న మాట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !