మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై శామిర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి అక్రమంగా కబ్జా చేశారని వీరేశం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భూకబ్జా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మల్లారెడ్డి గతంలోనే గిరిజనుల భూములను అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు . ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే గతంలో ఐటీ దాడులు కూడా జరిగాయి. పేదల భూములను కబ్జా చేసి కాలేజీలు కట్టారని ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మల్లారెడ్డి అక్రమంగా ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని బాధితులు వేడుకున్నారు . అమాయకులైన గిరిజన ప్రజలను చూసి మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అనచరులు 9 మంది బీఆర్ఎస్ నాయకులు అధికార అహంకారంతో కుట్ర చేశారన్మారు. మాకు తెలియకుండా రూ. 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల భూమిని అర్థరాత్రి సమయంలో రిజిస్టేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మల్లారెడ్డి ఆస్తుల పైన సమగ్ర విచారణ జరిపి గిరిజనులకు చెందాల్సిన భూమిని ఇప్పించాలని బాధితులు కేతావత్ బిక్షపతి వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి మీడియా ముఖంగా విన్నవించారు.