ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకు స్థాపన చేశారు. గోద్రెజ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన భూమిని గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారని రైతులు ఆందోళన చేశారు. జిల్లా అధికారులే బెదిరించి వంద ఎకరాలకు పైగా భూమిని తమ వద్ద నుంచి సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భూమిని ఇచ్చిన తర్వాత కేవలం రూ.20లక్షలు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.5 లక్షలు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదిస్తే సరైనా సమాధానం ఇవ్వడం లేదని.. ఇక చేసేది ఏమీ లేక అందోళన బాట పట్టామని రైతులు తెలిపారు.