అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. రామ మందిరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎల్ కే ఆడ్వానీ(96), మురళీ మనోహర్ జోషి(89) ఇద్దరు నేతలను విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్ కుమార్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆ ఇద్దరు నేతలు చెప్పినట్లు సమాచారం.
అంతకుముందు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుకలకు ఇద్దరు సీనియర్ నాయకులు రాకపోవడం మంచిదని రామ మందిర ట్రస్ట్ సభ్యులు సోమవారం విన్నవించారు. ”మా వినతిని వారిద్దరూ స్వీకరించారు.. ఆలయ వేడుకలకు హాజరుకావడం లేదు” అని ట్రస్టు ప్రధాన కార్యదర్మి చంపత్ రాయ్ విలేకరులకు వెల్లడించారు. ఆయన ప్రకటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆడ్వానీ, మురళీ మనోహర్ జోషిని ఆహ్వానించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ప్రధానమంత్రి దేవగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని ట్రస్టు సభ్యులు తెలిపారు. జనవరి 23 నుంచి అయోధ్య రామమందిరంలోకి సాధారణ భక్తులను అనుమితిస్తారు.