- పైరవీలు చేసే దళారీలను నమ్మవద్దు
- – ఫ్రెండ్లీ పోలీసింగ్ భద్రాద్రి జిల్లా పోలీసుల లక్ష్యం…
- – చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించం…
- – ప్రజలు సమస్యలపై తమను నేరుగా కలువ వచ్చు…
- – చర్ల సిఐ బి రాజగోపాల్
మన్యం న్యూస్ చర్ల:
తమ పబ్బం గడుపుకునేందుకు కొంతమంది మధ్య దళారీలు ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ పైరవీలు చేస్తున్నారని, అటువంటివారిని నమ్మవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తమ వద్ద సమస్య పరిష్కరించుకోవాలని చర్ల సిఐ బి రాజగోపాల్ వెల్లడించారు.శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఏమైనా సమస్యలు ఏర్పడి పోలీస్ స్టేషన్ కు రావలసిన అవసరం ఏర్పడితే దళారులను ఆశ్రయించవద్దని, నేరుగా తమను కలిసి సమస్యలు విన్నవించుకోవచ్చని సూచించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, ఓ ఎస్ డి టి సాయి మనోహర్, భద్రాచలం ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తాము,తమ సిబ్బంది కట్టుబడి పని చేస్తున్నామని, ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో తమ సేవలు వినియోగించుకోవాలని కోరారు.కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో పైరవీలు చేస్తామంటూ ప్రజలను మభ్యపెడుతూ దళారీలుగా అవుతారమెత్తారని తమ దృష్టికి వచ్చిందని, అటువంటివారు తమ పద్ధతులు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని హెచ్చరించారు.అలాగే మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొంతమంది వ్యక్తులు మావోయిస్టు కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తూ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉన్నదని, ఇప్పటికైనా వారిలో మార్పు రాకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఎస్సైలు టి వి ఆర్ సూరి, నర్సిరెడ్డి, వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బంది రవీంద్ర,బాలకృష్ణ,ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.