సంక్రాంతి పండుగ రేసులో ఈ సారి అయిదు సినిమాలు పోటీపడుతున్నాయి. దీంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. పండుగ వేళ విడుదలయ్యే సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ ముందు నుంచి విడుదల తేదీ ప్రకటించగా.. ఆ తరువాత వెంకటేష్ కథానయకుడిగా వస్తున్న థ్రిలర్ ‘సైంధవ్’, నాగార్జున నటిస్తున్న ‘నా సామి రంగా’, రవితేజ హీరాగా ఈగల్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
వీటిలో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ మినహా అన్ని స్టార్ హీరోల సినిమాలే. అయితే హనుమాన్ టీజర్, ప్రొమోషన్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి ఈ అయిదు సినిమాలు రిలీజ్ కావడంతో అన్నింటికీ థియేటర్లు కేటాయించడం.. డిస్ట్రిబూటర్లకు తలనొప్పిగా మారింది. అయిదింటిలో ఏ సినిమా నిర్మాత కూడా తమ సినిమా విడుదలను వాయిదా వేయడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ సమస్య తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంది.
ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, అగ్రనిర్మాత దిల్ రాజు స్పందించారు. “ఫిల్మ్ ఛాంబర్‌లో ఆ అయిదు సినిమాల విడుదలపై చర్చలు జరిపాము. సంక్రాంతి పోటీ నుంచి కనీసం రెండు సినిమాలు తప్పుకుంటేనే థియేటర్లు సర్దుబాటు సులభంగా చేయగలము. సంక్రాంతి బరి నుంచి తప్పకున్న సినిమాలకు సోలో రిలీజ్ డేట్ కూడా ఇస్తాము. గుంటూరు కారం మినహా మిగతా నాలుగు సినిమాలలో ఏ ఒక్క సినిమా విడుదల వాయిదా వేసుకున్నా అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఈ అయిదు చిత్రాలు ఒకేసారి విడుదల చేస్తే దేనికీ న్యాయం చేయలేం,” అని చెప్పారు.