UPDATES  

 గూఢచర్యం కేసు.. భారత్ నౌకాదళ మాజీ అధికారులకు ఊరట.. మరణశిక్ష రద్దు..

గూఢచర్యం ఆరోపణలతో ఖతర్‌లో మరణశిక్ష పడిన భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతర్‌ కోర్టు ఈ కేసుపై కీలక తీర్పు వెల్లడించింది. వారికి విధించిన మరణశిక్షను రద్దు చేసింది.

 

అయితే వారికి ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. దీనిపై ఖతర్‌ అధికారులను సంప్రదించి చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో న్యాయపరంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

కేసు చరిత్ర..

ఖతర్‌లోని భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్‌ భద్రత దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే ఇండియాకు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్‌ అధికారులు 2022 ఆగస్టులో అదుపులోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

 

కేసు విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం 8 మందికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబర్ లో తీర్పు వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ ఈ తీర్పుపై దోహాలో అప్పీలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దు చేసింది.

 

మరణశిక్ష పడిన వారిలో కెప్టెన్లు నవతేజ్‌ గిల్‌, సౌరభ్‌ వశిష్ఠ్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, సుగుణాకర్‌ పాకాల, పూర్ణేందు తివారీ, అమిత్‌ నాగ్‌పాల్‌, సంజీవ్‌ గుప్తా,సెయిలర్‌ రాగేశ్ ఉన్నారు. సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందినవారు. ఖతర్ కోర్టు తీర్పుపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !