అదానీ గ్రూపు కంపెనీల యజమాని, ఇండియా దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. అదే ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 12వ స్థానం పొందారు.
సరిగ్గా ఏడాది క్రితం జనవరి వరకు అదానీ ఆసియా శ్రీమంతులలో అగ్రస్థానంలోనే ఉండేవారు. కానీ కంపెనీ షేర్లను మార్కెట్‌లో షార్ట్ సెల్లింగ్ చేశారంటూ హిండెన్ బర్గ్ సంస్థ నివేదికలో ఆరోపణలు ఉండడంతో ఆయన కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది.
దీంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ తగ్గిపోయి.. ఆసియా ఖండం అత్యంత ధనవంతుడి టైటిల్‌ను కోల్పోయారు. తాజాగా సుప్రీం కోర్టు.. హిండెన్ బర్గ్ నివేదికను నమ్మలేమని చెబుతూ.. అదానీ కంపెనీల ఆరోపణలపై షేర్ మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితంగా అదానీ కంపెనీల షేర్ల విలువ మళ్లీ మూడు రోజులపాటు పెరుగుతూనే ఉంది. ఈ షేర్ల విలువలో పెరుగుదల కారణంగా అదానీ ఆస్తి విలువ కూడా భారీగా పెరిగింది. అదానీ పోర్ట్, ఎసిసి సిమెంట్, ఇతర అదానీ కంపెనీల షేర్లు గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.
తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ ఆస్తి విలువ 97.6 బిలియన్ డాలర్లు. అయితే ఇండియా దిగ్గజ బిజినెస్ మెన్ ముకేశ్ అంబానీ ఇంతకాలం ఆసియా, భారత్‌లలో అత్యంత ధనవంతుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 97 బిలియన్ డాలర్లు. అదానీ పుంజుకోవడంలో ముకేశ్ అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో కూడా అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. అంటే అదానీ వెంటే అంబానీ కూడా ఉన్నారు.