UPDATES  

 ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ మృతి.. యూఎన్‌ ప్రకటన..

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌, ముంబయి తాజ్ హోటల్(26/11) పై జరిగిన దాడుల్లో ప్రధాన సూత్రధారి హఫీజ్‌ అబ్దుల్‌ సలాం భుట్టవి మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అతడు పాకిస్థాన్‌లోని మార్కడే జైలులో ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు . జైలులోనే మే 29న గుండెపోటుతో మరణించినట్లు యూఎన్‌ భద్రతామండలి అల్‌ఖైదా ఆంక్షల కమిటీ తాజాగా ప్రకటించింది.

 

ప్రపంచంలో అనేక ఉగ్రదాడులలో భుట్టవి కీలక పాత్ర పోషించాడు. ఉగ్రవాదులకు మార్గనిర్దేశం చేసేవాడు. ఎల్‌ఈ‌టీ సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను నిర్భందించి రెండుమూడు సందర్భాల్లో ఉగ్రకార్యకలపాలకు నాయకత్వం వహించాడు. భారత్‌లో 2008లో ముంబయి తాజ్ హోటల్‌పై జరిగిన దాడుల తర్వాత దాదాపు ఏడాది పాటు సయీద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత లష్కరే తోయిబా చీఫ్‌గా సలాం భుట్టవి వ్యవహరించాడు.

 

ముంబయి దాడికోసం ఉగ్రవాదులకు శిక్షను ఇవ్వడంలో భుట్టవి ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం ఆరోపించింది. ఉగ్రవాదులను ఉపన్యాసాలతో రెచ్చగొట్టి సామాన్య ప్రజలపైకి ఉసి గొలిపాడంటూ భారత్‌ పలుమార్లు ఆరోపించింది. సంస్థలోని మదర్సా నెట్‌వర్క్‌ బాధ్యతలు కూడా స్వయంగా పర్యవేక్షించేవాడు. లాహోర్‌లో 2002లో లష్కరే తోయిబా సంస్థ స్థావరాన్ని ఏర్పాటు చేయడంలో భుట్టవి కీలక పాత్ర పోషించాడు.

 

మరోవైపు లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఉగ్రదాడులకు సంబంధించిన మొత్తం 7 కేసుల్లో అతడు 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2020 ఫిబ్రవరి 12 నుంచి సయీద్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు యూఎన్‌ తెలిపింది. భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులలో కీలక పాత్ర వహించాడు. సయీద్‌ను విచారణకు నిమిత్తం తమ దేశానికి అప్పగించాలని భారత్ చాలాసార్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !