తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల పైన ఫోకస్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవకుంటే రాజకీయంగా నష్ట పోతామని భావిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో సీట్ల పైన ఆశలు పెట్టుకున్నాయి. దీంతో, కేసీఆర్ ఈ సారి అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాజీ సీజేఐకు సీటును ఆఫర్ చేసారు.
ప్రతిష్ఠాత్మకంగా: మరి కొద్ది రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. రేవంత్ కు మెజార్టీ సీట్లు గెలవటం ద్వారా పార్టీ..ప్రభుత్వంలో మరింత బలం పెంచుకొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడటంతో..ఈ ఎన్నికల్లో బలం పెంచుకుంటేనే రానున్న రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
BRS Chief KCR offers Malkajgiri Loksabha Seat for Former CJI NV Ramana As per Reports
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ ఓట్లు, సీట్లు పెంచుకుంది. అయోధ్య రామ మందిరం అంశం తమకు అనుకూలంగా మారుతోందని భావిస్తోంది. తెలంగాణలో ఈ సారి అధిక సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పార్టీ నేతలు పార్లమెంటరీ నియోకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ ఆఫర్: బీఆర్ఎస్ ను తటస్థులను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్న వేళ కేసీఆర్ మరింత అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించినట్లు సమాచారం.
ఒక ప్రముఖ దిన పత్రికాధిపతి ఎడిటోరియల్ లో ఈ అంశం వెల్లడించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని కేసీఆర్ అంచనాగా పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారుని వెల్లడించారు.
కొత్త వ్యూహాలతో: 2014లో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం సాగినా ఆ అవకాశాలు లేవని పార్టీ నేతల సమాచారం. దీంతో, పరిస్థితులకు అనుగుణంగా కేటీఆర్ ను పార్లమెంట్ కు పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ కు బాధ్యతలు కేటాయిస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఫిబ్రవరి 17 నుంచి కేసీఆర్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో.. పార్లమెంట్ ఎన్నికల వేళ అభ్యర్దుల ఎంపికతో పాటుగా గెలుపు కోసం కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.