చారిత్రక అయోధ్య(Ayodhya)లో కొలువుదీరిన రామ్‌లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నేడు బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యారు అరుణ్ యోగిరాజ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ భూమ్మీద తన కంటే అదృష్టవంతులు ఎవరూ లేరంటూ సంతోషం వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ తయారుచేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అది సోమవారం ఆలయంలో కొలువుదీరింది. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే అనే భావన కలుగుతోందన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్‌లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనతో ఉంటాయన్నారు.
ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తుంది అని చెబుతూ అరుణ్ యోగిరాజ్ ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో ఒక్క విగ్రహాన్ని గర్భగుడి కోసం ఎంపిక చేశారు. అదే యోగిరాజ్ చెక్కిన బాల రాముడి విగ్రహం. ఇక మిగిలినవారు చెక్కిన విగ్రహాలను కూడా ఆలయంలోని ఇతర ప్రాంతాల్లో ఉంచనున్నారు.
రామ్‌లల్లా అని భక్తులు ఎంతో ప్రేమతో పిలుచుకునే ఈ బాల రాముడి విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయమైన కృష్ణశిలతో తీర్చిదిద్దారు. శ్రీరామనవమి రోజున సూర్య కిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాప్రతిష్ఠ క్రతువు వేడుకగా జరిగింది. వేలాది మంది సాధువులు, స్వామిజీలు, ప్రముఖులు రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకను తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంలో ప్రజలు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు.