UPDATES  

 పీచుమిఠాయితో కేన్సర్.. అందుకే నిషిద్ధం..

చూడటానికి దూదిపింజలా.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పీచుమిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిన్నలు, పెద్దలు అందరూ దాని కోసం ఎగబడేవారే. అయితే ఆ పీచుమిఠాయిని అదే పనిగా తిన్నారనుకోండి.. కేన్సర్ రావడం ఖాయం.

 

ఎందుకంటే కేన్సర్ కారకమైన రసాయన సమ్మేళనం పీచుమిఠాయిలో ఉందట. ఈ కారణంగానే తమిళనాడు ప్రభుత్వం పీచుమిఠాయి తయారీ, అమ్మకాలను నిషేధించింది. అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు పీచుమిఠాయి శాంపిళ్లకు పరీక్షలకు పంపారు. అందులో కేన్సర్ కారక రసాయన సమ్మేళనం రోడమిన్-బీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైంది.

 

రోడమిన్-బీ అనేది నీటిలోకరిగిపోయే కెమికల్. డై లాగా పనిచేస్తుంది. చిక్కటి గులాబీ వర్ణం కోసం పీచుమిఠాయి తయారీలో దీనిని వినియోగిస్తారు. రోడమిన్-బీ కలిగిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే శరీరం విషతుల్యమవుతుంది. కణజాలం, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆహారోత్పత్తుల్లో దీని వినియోగం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పీచుమిఠాయి తయారీ, అమ్మకాలపై తమిళనాడు సర్కారు నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

 

అంతకు కొన్ని రోజుల ముందే పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పీచుమిఠాయిని నిషేధించింది. పీచుమిఠాయిలో రోడమిన్-బీ ఆనవాళ్లు ఉన్నట్టు ఈ నెల 9న బయటపడటంతో ఈ చర్యలు తీసుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !