UPDATES  

 ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ కసరత్తు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాకులమీద షాకులు తగిలాయి. ఇప్పటికే చాలా మంది నేతలు కారు దిగిపోయారు. మరికొంత మంది గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జహీరాబాద్,పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఎంపీలు పార్టీని వీడారు. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.

 

మరోవైపు చేవెళ్ల లోక్ సభ స్థానం పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆసక్తిగాలేరు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇక్కడ నుంచి ఎవరిని పోటీకి దించాలా అన్న అంశంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న కాసాని జ్ఞానేశ్వర్ పేరును చేవెళ్ల ఎంపీ స్థానానికి ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.

 

తాజాగా చేవెళ్ల, నల్లొండ, భువనగిరి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల బరి నుంచి రంజిత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతోనే తప్పుకున్నారని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఆయన పార్టీ మారడంలేదని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. చేవెళ్ల లోకసభ స్థానంలో విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసినా ఎంపీ సీటు గెలుస్తామన్నారు.

 

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే ఎంపీ టిక్కెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనకపోవడంపై చర్చ జరుగుతోంది. అమిత్ రెడ్డి ఇప్పటికే ఎంపీ టిక్కెట్ విషయంలో వెనక్కి తగ్గారు. టిక్కెట్లు ఆశిస్తున్న నేతల వివరాలను కేసీఆర్ పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ బాధ్యతను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !