UPDATES  

 సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు…

సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పని చేసే అబ్జర్వర్లకు సూచనలు చేశారు. పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

 

ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో 2,100 మంది ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో పరిశీలకులది క్రియాశీలక పాత్ర. అందుకే ఎన్నికల సంఘం నిబంధనలను పాటించే విధంగా స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

 

ఎన్నికలపై ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ, మెయిల్ నంబర్స్ కు తగిన ప్రచారం కల్పించాలని రాజీవ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల పరిశీలకులందరూ ఫోన్, మెయిల్ కు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికలు జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్లు పరిశీలించాలని ఆదేశించారు.

 

వారం రోజుల్లోపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఇలా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. వారికి కీలక సూచనలు చేశారు. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.

 

లోక్ సభ ఎన్నికల పలు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికలు నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !