అశ్వారావుపేట, ఏప్రిల్ 02: (కొమురం భీమ్) మండల పరిదిలోని అనంతారం గ్రామంలో పట్టాలు కలిగిన పోడు భూముల్లో కందకాలు ఆపాలని సి పి ఐ యంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కందకాలు తీస్తున్న పోడు భూమిని సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారితో మాట్లాడుతూ 2022 సంవత్సరం నవంబర్ లో గత ప్రభుత్వం పోడు భూములలో సర్వే చేసి పోడు సాగు దారులకు పోడు భూమి పట్టా పాసు బుక్స్ పంపిణీ చేసిందని, పోడు భూములను సాగు చేస్తూ జీవనం గడుపుతున్న గిరిజనులను ఇప్పుడు మీరు వచ్చి గిరిజన పోడు భూములకు కందకాలు తీయటం సరైనది కాదని, వెంటనే కందకాలు తీసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని, లేనిచో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోడు సాగు దారులు అనంతారం గ్రామస్తులు బరగడ నాగేశ్వరావు, ముయబోయిన రత్తయ్య, కుర్సం రాంబాబు, కుర్సం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.





