UPDATES  

 ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా.. తూర్పు వాళ్లు చైనీయుల్లా కనిపిస్తారు’.. శామ్ పిట్రోడా..

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కున్న ఆయన.. మరోసారి తన మాటలతో కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని విభన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

 

భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఆయన మాటలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులని, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లు మాదిరిగా ఉంటారని ఆయన అన్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశం ఓ నిదర్శనమని పిట్రోడా అన్నారు. లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని గుర్తుచేశారు. మనది వైవిధ్యమైన దేశమైనందున తూర్పున ఉన్న ప్రజలు చైనాయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని వెల్లడించారు. ఇకపోతే ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులు మాదిరిగా ఉంటే.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని శామ్ పిట్రోడా అన్నారు.

 

ఎవరు ఎలా ఉన్నాసరే.. మనమంతా సోదరసోదరీమణులమే అని తెలిపారు. మనమంతా పరస్పరం భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటునే ఉంటామని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశ ప్రజల మూలాల్లో పాతుకుపోయాయని అన్నారు.

 

భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం గురించి వెళ్లడించే క్రమంలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పిట్రోడా వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తాను ఈశాన్య భారతదేశానికి చెందిన వ్యక్తిని అని.. కానీ భారతీయుడిలా కనిపిస్తానని అన్నారు. కాస్త భారతదేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. వైవిధ్య భారతావనిలో భిన్నంగా కనిపించినా సరే అందరూ ఒక్కటే అని అన్నారు.

 

మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్ కూడా ఘాటుగా స్పందించారు. శామ్ పిట్రోడా రాహుల్ గాంధీ మెంటార్ అని విమర్శించారు. భారతీయులపై ఆయన చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని అన్నారు. విభజించు-పాలించు అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని మరోసారి ఆయన మాటాలతో స్పష్టమవుతోందని మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !