మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని చిరు అందుకున్నారు. నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక చిరు అవార్డును అందుకున్న సమయంలో ఆయన కొడుకు, హీరో రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఉన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సేవా రంగాల్లో సేవలందించినందుకు గౌరవార్థంగా కేంద్రప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తుంది. అసాధారణమైన విశిష్ట సేవకు పద్మవిభూషణ్ పురస్కారం, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్ పురస్కారం, విశిష్ట సేవలకు పద్మశ్రీ పురస్కారం అందిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే వెంకయ్య నాయుడు తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు. నేడు చిరుతో పాటు నటి వైజయంతీ మాల మరికొందరు ఈ అవార్డులను అందుకున్నారు. ఇకఈ అవార్డును తీసుకోవడానికి చిరు ఎంతో హుందాగా రెడీ అయ్యినట్లు కనిపిస్తుంది. బ్లూ కలర్ సూట్.. బ్లాక్ కళ్ళజోడుతో హుందాగా కనిపించారు.