ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కూబింగ్ చేస్తుండంగా పోలీసులకు ఒక్కసారిగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాగా, ఈ కాల్పుల్లో 12 మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు పక్కా సమాచారంలో వారిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.
బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవుల్లో మావోలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బలగంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగగా మావోయిస్టులు మృతి చెందగా.. బలగాలకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, గత కొన్ని రోజులుగా మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్ చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పిడియా గ్రామ పరిసరాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గత నెల 16వ తేదీన కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఆ ఘటన ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన కావడం విశేషం. దీంతో పాటుగా గత నెల 30వ తేదీన నారాయణ్ పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోలకు కాల్పులు జరగగా.. 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.