ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరికొద్దిగంటల్లో ముగుస్తుందనగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రాణ మిత్రుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు మరీ ముఖ్యంగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా కుటుంబం మొత్తం ఒక్కటైన వేళ అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వైసీపీ అభ్యర్ధి పక్షాన నిలబడటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెంటనే మెగా, పవన్ , జనసేన అభిమానులు బన్నీని నేరుగా టార్గెట్ చేయడం.. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాతో మోత మోగిపోయింది.
ఏపీలో ఎన్నికలు ముగిశాక కూడా బన్నీ ఇష్యూ సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు వేసిన ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. ” మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే ” అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌ని ఉద్దేశించినదేనంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్వతహాగానే నాగబాబుకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. వారిపై ఈగ వాలినా ఊరుకోరు. చిరు, పవన్‌లపై ఏ విమర్శ వచ్చినా .. ముందు నిలిచేది, వెంటనే స్పందించేది నాగబాబే అనడంలో అతిశయోక్తి లేదు. సొంత మేనమామ పిఠాపురంలో కష్టపడుతుంటే .. పవన్ ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తి కోసం అల్లు అర్జున్ వెళ్లడాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే అప్పటికప్పుడు తొందరపడితే అది ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చి.. ఎన్నికలపై ప్రభావం పడుతుందనే కొంత తగ్గారని , అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం రాత్రికి నాగబాబు ట్వీట్ చేశారు. ఈ పరిణామాలు మెగా క్యాంప్‌లో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయంటున్నారు నెటిజన్లు. అయితే నిన్న ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ .. నంద్యాలకు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు.
తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా నా మద్ధతు ఉంటుందన్నారు. మేనమామ పవన్ కళ్యాణ్, ఫ్రెండ్ శిల్పా రవి, మా మావయ్య చంద్రశేఖర్ రెడ్డి, మా బన్నీ వాసు ఇలా ఎవరికైనా మద్ధుతగా ఉంటానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. శిల్పా రవి తనకు 15 ఏళ్లుగా ఫ్రెండ్ అని ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఊరుకి వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానని.. దీనిలో భాగంగానే భార్యతో కలిసి వెళ్లి రవికి విషెస్ తెలిపినట్లు అల్లు అర్జున్ స్పష్టం చేశారు.
బన్నీ చెప్పను బ్రదర్ కామెంట్స్, రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గీతా బ్యానర్‌లో సినిమాలు చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ తదితర పరిణామాలు.. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరు అనే సంకేతాలు జనంలోకి పంపాయి. అయినప్పటికీ కుటుంబంలో అన్ని శుభకార్యాలకు అందరూ హాజరవడం ద్వారా తామంతా ఒకటే అన్న భావనను కూడా వీరు వ్యక్తపరుస్తున్నారు. నంద్యాల పర్యటన నేపథ్యంలో వివాదం మరింత ముదరకుండా బన్నీ జాగ్రత్త పడుతున్నట్లే కనిపిస్తున్నాడు. ఇలాంటి వేళ నాగబాబు పెట్టిన ట్వీట్ ఎటు వైపు దారి తీస్తుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.