UPDATES  

 వారణాసిలో మోదీ నామినేషన్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని మోదీ అఫిడవిట్ ప్రకారం, ఆయనకు రూ. 3.02 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ. 52,920 నగదు కలిగి ఉన్నారు. ప్రధాని మోదీకి సొంతిళ్లు, కారు లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన పేరు మీద ఎలాంటి భూమి కూడా లేదని మోదీ అఫిడవిట్‌లో తెలిపారు.

 

ప్రధాని మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షల నుంచి 2022-23 నాటికి రూ. 23.5 లక్షలకు రెట్టింపు అయిందని అఫిడవిట్ చూపుతోంది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మోదీ రూ.73,304 డిపాజిట్ చేయగా, ఎస్‌బీఐ వారణాసి బ్రాంచ్‌లో రూ.7వేలు మాత్రమే ఉన్నాయి.

 

ప్రధానమంత్రి ఎస్‌బీఐలో రూ.2,85,60,338 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా కలిగి ఉన్నారు. ప్రధానమంత్రి వద్ద రూ.2,67,750 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మోదీ విజయం సాధించి తొలిసారి ప్రధాని అయ్యారు. 2019లో ఈ స్థానం నుంచి పోటీ చేసి రెండో సారి ప్రధాని అయ్యారు. ముచ్చటగా మూడోసారి మోదీ వారణాసి బరిలో ఉన్నారు. జూన్ 1న చివరి దశలో వారణాసికి ఎన్నికలు జరగనున్నాయి.

 

మంగళవారం, ప్రధాని మోదీ తన నామినేషన్ దాఖలు చేయడానికి వారణాసి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లినప్పుడు, ఆయనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా తదితరులు ప్రధాని వెంట కనిపించారు. ప్రధాని మోదీతో పాటు తన నలుగురు ప్రతిపాదకులు- పండిట్ గణేశ్వర్ శాస్త్రి, లాల్‌చంద్ కుష్వాహా, బైజ్‌నాథ్ పటేల్, సంజయ్ సోంకర్ కూడా ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !