భారత్ లోకి ప్రవేశించేందుకు మరోసారి ఉగ్రవాదులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం భంగం చేసింది. దేశంలో వచ్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (LOC) వెంబడి.. గురువారం భారతసైన్యం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని విఫలం చేసింది.
ఉగ్రవాదులపై కాల్పులు జరుపగా.. ఇద్దరు హతమయ్యారు. తంగ్ ధర్ సెక్టార్లోని కంచెకు అవతలివైపు ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయి. మిగతా ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు.. భారత సైన్యం అప్రమత్తమైంది. అమ్రోహి, తంగ్ ధర్ ప్రాంతంలో భారత సైన్యం, జమ్ము – కశ్మీర్ పోలీసులు కలిసి ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో రెండు తుపాకీలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత నెలలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. బారాముల్లా జిల్లా ఉరీలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటును విఫలం చేశారు. ఈ క్రమంలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.