వైద్యుని నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ బాలిక చేతి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశారు. దీంతో ఆ బాలిక మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్నఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దారుణమైన ఈ ఘటన కేరళలోని కోజికోడ్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అయితే, సర్జరీ ద్వారా ఆ వేలును తొలగించవచ్చని డాక్టర్లు సూచించడంతో తమ కుమార్తెను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ డాక్టర్ నిర్లక్ష్యంతో చేతి వేలికి బదులు నాలుకకు సర్జరీ చేశాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికొచ్చిన ఆ చిన్నారిని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ పాప చేతికి ఉండాల్సిన బ్యాండేజ్ కాస్త నోటికి ఉండడంతో ఆ చిన్నారి తల్లితండ్రులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని ఆసుపత్రి సిబ్బందిని, వైద్యులను అడగగా, నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని చెప్పారు. దీంతో ఆ మాటలు విన్న తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.
స్పందించిన ప్రభుత్వం..
ఇక, ఈ విషయంపై కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బెజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆమె అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు డాక్టర్ జాన్సన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, జరిగిన పొరపాటు తెలుసుకున్న వైద్యులు ఆ చిన్నారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని వారికి చెప్పారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక, ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వైద్యుని నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాటుతో కుమార్తెకు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఆసుపత్రే బాధ్యత వహించాలి అని అన్నారు. వైద్యుడు చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.