అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గతరాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీపీ ఉమమహేశ్వరరావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 14 చోట్ల సోదాలు చేశారు. దాదాపు 38 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించింది. ఇవేకాకుండా 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను గుర్తించారు.
తెలంగాణలోని ఘట్‌కేసర్‌లో ఐదుచోట్ల, శామీర్ పేట్, మల్కాజిగిరి, కూకట్‌పల్లితోపాటు ఏపీలోని విశాఖపట్నం, చోడవరం ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు నాలుగు కోట్ల ఆస్తిని అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో దీనికి రెండు రెట్లుగా ఉంటుందన్నది ఓ అంచనా.
శామీర్‌పేట్‌లో ఖరీదైన విల్లాను గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు తేల్చారు. వాటిని ఇంకా ఓపెన్ చేయాల్సివుంది. ఏసీపీ వ్యవహారంపై తీగలాగితే డొంక అంతా కదులుతోంది. దర్యాప్తు ముగిసేసరికి ఈ ఆస్తులు అమాంతంగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారుల అంచనా.
సాహితీ ఇన్‌ఫ్రా కేసును సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంస్థ హైదరాబాద్ చుట్టూ వెంచర్ల పేరిట వందలాది మంది నుంచి ప్రీలాంచ్ పేరుతో దాదాపు 2000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రధాన అభియోగం. ఈ సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులపైనా సీసీఎస్‌లో కేసు బుక్కయ్యింది. ఈ కేసును ఉమమహేశ్వరరావు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భారీగా ముడుపులు తీసుకున్నారనే వార్తలు జోరందుకోవడం, ఏసీపీ రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయింది. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.