UPDATES  

 మంచి మనసు చాటుకున్న కేటీఆర్..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక్కడున్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. అత్యధిక స్థానాలను గెలుచుకుంటామనే ధీమా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల్లో వ్యక్తమౌతోంది.

 

అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం నెలకొంది తెలంగాణలో. వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్.. తాము దక్కించుకోవడానికి మిగిలిన రెండు పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

 

బీఆర్ఎస్ జెండా ఎగిరిన సీటు ఇది. 2021 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆయన జనగామ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఇక్కగ ఉప ఎన్నిక అవసరమైంది.

 

బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకే్‌షరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనుంది ఈ స్థానానికి. గడువు సమీపించిన నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.

 

కాగా- ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి నర్సంపేట్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు అనూహ్య సంఘటన ఎదురైంది. మార్గమధ్యలో వరంగల్ లేబర్ కాలనీ మీదుగా ఆయన కాన్వాయ్ బయలుదేరి వెళ్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆయన కంటపడ్డారు.

 

గాయపడ్డ వ్యక్తిని 55 సంవత్సరాల అంజయ్యగా గుర్తించారు. ఆయనను చూడగానే హుటాహుటిన తన కాన్వాయ్‌ను ఆపివేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన అంజయ్యను తన కాన్వాయ్‌లోని కారులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి నాణ్యమైన చికిత్స అందించాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !