దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుడుతూనే ఉంది. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసేందుకు పుష్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆర్బీఐ తాజాగా యూపీఐ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చింది.
ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం సామాన్య ప్రజలు తమ UPI లైట్లో బ్యాలెన్స్‌ని ఆటోఫిల్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు ప్రజలు ప్రతిసారీ డబ్బును బదిలీ చేయాల్సివచ్చేది. కానీ కొత్త మార్పు వల్ల UPI లైట్‌లోని డబ్బు పరిమితి కంటే తగ్గిన ప్రతిసారి బ్యాంక్ ఖాతా నుంచి UPI లైట్‌కి ఆటోమేటిక్‌గా బదిలీ చేయబడుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లైట్‌ని ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్‌తో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం అంటే జూన్ 7, 2024న వెల్లడించారు. ఇది డిజిటల్ చెల్లింపులు చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
UPI లైట్ సేవ ప్రస్తుతం వినియోగదారులు తమ వాలెట్లో రూ.2,000 వరకు లోడ్ చేయడానికి, రూ.500 వరకు చెల్లింపులు చేయడానికి సహాయపడుతుంది. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా మారబోతోంది. ప్రతిపాదిత ఇంటిగ్రేషన్ ప్రకారం వినియోగదారులు ఇప్పుడు UPI లైట్ వాలెట్ కోసం ఆటో-రిప్లెనిష్మెంట్ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతారు. అంటే వాలెట్ బ్యాలెన్స్ యూజర్ సెట్ పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లయితే.. వారి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ చేయబడుతుంది. ఇది అదనపు ధృవీకరణ లేదా ప్రీ-డెబిట్ నోటిఫికేషన్ అవసరాన్ని తొలగిస్తుంది.
ఆర్బీఐ తాజా చర్య వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. UPI లైట్ లావాదేవీలను మునుపటి కంటే మెరుగ్గా చేయాల్సిన అవసరంపై రిజర్వు బ్యాంక్ దృష్టి పెట్టింది. UPI లైట్‌ని ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా, కస్టమర్లకు అవాంతరాలు లేని డిజిటల్ చెల్లింపులతో పాటు చిన్న విలువ లావాదేవీల సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ యూపీఐ లైట్ చెల్లింపుల్లో కొత్త వెసులుబాటును చేర్చింది.