UPDATES  

 TDP నేతలపై ఈడీ దాడులు..

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు మద్దతు పలికారు. నాడు మోడీపై ఎన్నో తీవ్ర విమర్శలు చేశాడు. అయితే నవ్విన నాపచేనే పండినట్టు.. నాడు మోడీ గెలిచాడు. నానా యాగీ చేసిన చంద్రబాబు ఓడిపోయారు. దీంతో తన పార్టీ తరుఫున గెలిచిన రాజ్యసభ ఎంపీలను అంతా పువ్వుల్లో పెట్టి బీజేపీలోకి తోలి చంద్రబాబు నాడు మోడీకి మద్దతు ఇచ్చారు. బీజేపీకి తక్కువగా ఉన్న రాజ్యసభ ఎంపీల లోటును ఇలా తీర్చాడు. అయితే గడిచిన మూడు నాలుగేళ్లుగా ఏపీలో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేయలేదు. సంధికి వచ్చి తలొగ్గిన బాబును లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీపై ప్రతీకారం మొదలైనట్టే కనిపిస్తోంది. ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అర్థమవుతోంది. తెలుగుదేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న కీలక నేతలు, పారిశ్రామికవేత్తలపై ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతోంది. టీడీపీకి నిధులు అందకుండా మరింతగా ఆ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబుపై ప్రతీకారాన్ని మోడీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే టైం ఉంది. ఇప్పుడు టీడీపీ నేతలు, పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యాపారేవేత్తలు టార్గెట్ గా ఈడీ దాడులు జరగడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఈడీ దాడుల్లో టీడీపీ అనుకూలురే ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇటీవల తాడిపత్రికి చెందిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై ఈడీ దాడి చేసి ఆయన 22 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇక పెనుగొండ టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ దాడి చేసి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని షాకిచ్చింది. ఇక ఇటీవలే టీడీపీకి చెందిన మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి, విజయవాడ అక్కినేని మహిళా ఆస్పత్రిపై ఐటీ, ఈడీ దాడులు నిర్వహించారు.

43 కోట్లు పక్కదారి పట్టినట్టు సమాచారం. ఈ సొమ్మును హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఇక నాడు ఐటీ శాఖ చూసిన మంత్రి నారాలోకేష్ హయాంలో జరిగిన కుంభకోణంపైనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ‘స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ పేరిట రూ.370 కోట్ల చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ చెల్లించలేదని.. అనేక అవకతవకలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, మాజీ ఎండీ గంటా సుబ్బారావులతోపాటు పలువురు నోటీసులు అందుకున్నారు. వీరంతా లోకేష్ కింద పనిచేసినవారే.. తేడా వస్తే లోకేష్ కు మూడినట్టే. సో నాటి 2019 ఎన్నికల నాటి ప్రతీకారాన్ని మోడీ ఇప్పుడు మొదలుపెట్టాడా? టీడీపీకి వచ్చే ఎన్నికల నాటికి నిధులు సమకూర్చకుండా ఆ పార్టీని చావుదెబ్బ తీసే ప్లాన్ చేశాడా? అన్న అనుమానాలు ఈ చర్యలతో కలుగుతున్నాయి. ఇదే జరిగితే మరోసారి టీడీపీకి చావుదెబ్బ ఖాయం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !